Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..
*డా. ఆదినారాయణ, డా. అడ్డాల సత్యనారాయణ...
కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :
ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సూర్య గ్లోబల్ ఆసుపత్రిలో ప్రజలకు గుండె ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుండె వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డా. ఆదినారాయణ వివరించారు.
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ గుండె దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని డా. ఆదినారాయణ తెలిపారు. గుండె జబ్బులను నివారించేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. పండ్లు, ఆకుకూరలు, ధాన్యాలు, పప్పుధాన్యాలను ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని, నూనె, ఉప్పు, పంచదారతో పాటు జంక్‌ఫుడ్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని సూచించారు.
రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడక, ఈత లేదా సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చన్నారు. బీపీ, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకుని నియంత్రణలో ఉంచుకోవాలని తెలిపారు. గుండె జబ్బులు కేవలం పెద్దవారికే పరిమితం కాదని, ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా యువతలోనూ గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఛాతీలో నొప్పి, తీవ్రమైన చెమటలు, ఊపిరి ఆడకపోవడం వంటి గుండెపోటు లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఒత్తిడిని తగ్గించుకుని గుండెకు ప్రశాంతతను అందించాలని, ధూమపానానికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు.
ప్రముఖ దంత వైద్య నిపుణులు డా. అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ గుండె ఆరోగ్యం కోసం చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. పొగతాగడాన్ని పూర్తిగా మానివేయాలని, మద్యం వంటి మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం, యోగా వంటివి చేయాలని సూచించారు.
ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరమని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా గుండెను పదిలంగా ఉంచుకోవచ్చని అన్నారు. గుండె ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డా. కుమార్ స్వామి, మణి, సూర్య గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు
