Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..
15 మంది చిన్నారుల్లో గుండె సంబంధిత సమస్యల గుర్తింపు – ఉచితంగా శస్త్రచికిత్సలు
కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :
కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాకినాడ యూనిట్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా, శ్రీ సత్యసాయి సంజీవని ట్రస్ట్ సహకారంతో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 18 సంవత్సరాల లోపు పిల్లలకు గుండె వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టారు
ఈ శిబిరానికి 80 మందికి పైగా చిన్నారులు హాజరుకాగా, వైద్య పరీక్షల్లో ఇద్దరు రెండు నెలల లోపు శిశువులతో పాటు, ఐదు నుంచి 15 సంవత్సరాల వయస్సు గల 13 మంది చిన్నారుల్లో గుండె సంబంధిత సమస్యలను గుర్తించారు. మొత్తం 15 మంది చిన్నారులకు శ్రీ సత్యసాయి సంజీవని ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలోనే ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె. అనిత, కోరమాండల్ యూనిట్ హెడ్ కె. జగనాథన్, కోరమాండల్ లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు గౌరీ జగనాథన్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె. అనిత శిబిరానికి వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి, వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కోరమాండల్ హెచ్‌ఆర్ విభాగానికి చెందిన ఇస్మాయిల్, శివరామ్, సీఎస్ఆర్ ఏజీఎం వంశీకృష్ణ, లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, సీఎస్ఆర్ బృందానికి చెందిన ప్రియాంబిక, యశోధకృష్ణ, రాణి తదితరులు పాల్గొన్నారు.

