Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..
*కిమ్స్ ట్రస్ట్ ఆసుపత్రి వైద్య నిపుణులు..
కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :
మన దేహాన్ని నిరంతరం నడిపించే గుండెను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కాపాడుకోవాలని గుండె శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ యు. రామకృష్ణ సూచించారు. ప్రపంచ గుండె వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కిమ్స్ ట్రస్ట్ ఆసుపత్రి ఆధ్వర్యంలో స్థానిక బోటు క్లబ్ ఉద్యానవనంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ యు. రామకృష్ణ మాట్లాడుతూ.. గుండె విశ్రాంతి లేకుండా పనిచేసే పంపింగ్ యంత్రం వంటిదని, సాధారణంగా ప్రతి నిమిషానికి సుమారు 72 సార్లు కొట్టుకుంటుందని తెలిపారు. గుండెలో నాలుగు కవాటాలు ఉంటాయని, వాటిలో సమస్యలు ఏర్పడితే రక్త ప్రసరణలో మార్పులు చోటుచేసుకుని గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు.
ప్రముఖ గుండె వ్యాధుల నిపుణులు డాక్టర్ పి.వి. నిశాంత్ మాట్లాడుతూ.. గుండె వైఫల్యం కారణంగా ఆయాసం, గుండె దడ, పొడి దగ్గు, కాళ్ల వాపు, నీరసం వంటి లక్షణాలు కనిపించవచ్చన్నారు. గుండె కవాటాల్లో సమస్యలు ఏర్పడినప్పుడు పరిస్థితిని బట్టి మందులతోనే చికిత్స చేయవచ్చని తెలిపారు. ఆరోగ్యకరమైన గుండె కోసం ప్రతిరోజూ కనీసం అరగంట వ్యాయామం చేయాలని సూచించారు.
డాక్టర్ బి.డి. పవన్ కుమార్ మాట్లాడుతూ.. పని ఒత్తిడి, టెన్షన్ కారణంగా యువతలోనూ గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ఆధునిక ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, పొగతాగడం, మద్యం సేవించడం, ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి కారణాలు గుండె జబ్బులకు దారితీసే అవకాశం ఉందన్నారు. ఛాతిలో అకస్మాత్తుగా నొప్పి, విపరీతంగా చెమటలు పట్టడం, వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదన్నారు. గుండె జబ్బులను నివారించేందుకు క్రమబద్ధమైన వ్యాయామం చేయడంతో పాటు జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్లు డి.వి.ఎస్. సోమయాజులు, సానా ప్రవీణ్, ఎస్.సి.హెచ్. రామకృష్ణ, డి. శ్రీకాంత్, రవి సంతోష్, వినోద్ తదితరులతో పాటు బోటు క్లబ్ వాకర్స్ సంఘం అధ్యక్షులు అడబాల రత్న ప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, రమ్య, విజయ భాస్కర్, రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిమ్స్ ట్రస్ట్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా ఈసీజీ, పల్స్, రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించారు.

