Kakinada : జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి హత్యపై ఎందుకీ మౌనం ?
- కటౌట్ శ్రీను పాత్ర పై నోరు మెదపరెం???
- నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి
- కాకినాడలో అదుపుతప్పిన శాంతి భద్రతలు ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి
కాకినాడ జిల్లా : కాకినాడ : ఫాస్ట్ రన్నర్ :
ప్రశాంతతకు మారుపేరైన కాకినాడలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని వైఎస్ఆర్సిపి కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ , మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నగర నడిబొడ్డున భానుగుడి సెంటర్ లో జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి దారుణ హత్య ఇందుకు ప్రధాన నిదర్శనమన్నారు.
సతీష్ రెడ్డి హత్య వెనుక టిడిపి నాయకుడు కటౌట్ శ్రీను పాత్ర ఉందని సతీష్ రెడ్డి భార్య జయశ్రీ స్వయంగా ఆరోపించినప్పటికీ ఇప్పటివరకు పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదని ద్వారంపూడి ప్రశ్నించారు. అతని వెనుక ఉన్న రాజకీయ శక్తులు ఎవరు? కటౌట్ శ్రీను పై చర్యల విషయంలో పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారు? హత్య జరిగి వారం రోజులు గడుస్తున్న ఇప్పటివరకు చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనకాడుతున్నారు ? ఎవరి ఒత్తిడి వల్ల నిందితులను కాపాడుతున్నారు? అంటూ ద్వారంపూడి ప్రశ్నలు సంధించారు. ఒక్క సతీష్ రెడ్డి హత్య కాకుండా... గడచిన కొద్ది రోజులుగా కాకినాడలో శాంతిభద్రతల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా హత్యలు, దౌర్జన్యాలు, అరాచకాలు జరుగుతున్నప్పటికీ చర్యలు తీసుకోలేని నిస్సహాయ పరిస్థితికి కారణమేమిటిని నిలదీశారు.
మృతుడు సతీష్ రెడ్డి భార్య జయశ్రీ గర్భవతిగా ఉండి కూడా స్వయంగా బయటకు వచ్చి ఆందోళన చేసి నిందితుల పేర్లు బహిరంగంగా ప్రకటిస్తున్న చర్యలు తీసుకోకపోవడం ఏమాత్రం సమర్ధనీయం కాదని ఆయన పేర్కొన్నారు. తక్షణమే ఆరోపణలు ఎదుర్కొంటున్న కటౌట్ శ్రీను, ఇతర నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని ద్వారంపూడి డిమాండ్ చేశారు.
నేరాలను అదుపు చేసే విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే పరిస్థితి మరింత అదుపుతప్పి ప్రశాంత కాకినాడ... అశాంతికి నిలయంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు తలవొగ్గి నిందితులను కాపాడాలని చూస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు.
