Kakinada : పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా భారీ బైక్ ర్యాలీ
కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పిఠాపురం నియోజకవర్గం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, యువత పాల్గొన్నారు.
కాకినాడ రూరల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పలు ప్రాంతాల మీదుగా పిఠాపురం నియోజకవర్గానికి చేరుకుంది. జనసేన జెండాలు చేతబూని, పార్టీ నినాదాలు చేస్తూ కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో ద్విచక్ర వాహనాలతో సాగిన ర్యాలీ ఆయా ప్రాంతాల్లో సందడిగా సాగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ..
ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేస్తున్న సేవలకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ భారీ బైక్ ర్యాలీ కాకినాడ రూరల్ నుంచి పిఠాపురం వరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాది మంది కార్యకర్తలు, అభిమానుల పాల్గొనడంతో ర్యాలీ ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.
