Kakinada : గంజాయి రహిత కాకినాడే లక్ష్యం..
కాకినాడ జిల్లా : కాకినాడ : ఫాస్ట్ రన్నర్ :
కోస్టల్ యూత్ ఫోర్స్’ ఆవిర్భావం..
ఘనంగా ‘హౌ టు లివ్ ఏ హెల్దీ లైఫ్’ అవగాహన సదస్సు...
యువతను సన్మార్గంలో నడిపిస్తూ మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో ‘కోస్టల్ యూత్ ఫోర్స్’ నూతన వేదిక ఆవిర్భవించింది. కాకినాడ రూరల్ మండలం తూరంగిలోని ఎన్‌సీవీ ఫంక్షన్ హాల్లో ఆదివారం ‘హౌ టు లివ్ ఏ హెల్దీ లైఫ్’ పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా కోస్టల్ యూత్ ఫోర్స్‌ను అధికారికంగా ప్రారంభించారు.
తూరంగి మాజీ సర్పంచ్ బలగం ప్రసన్నకుమార్, యువ నాయకులు అడ్డూరి హవ్యక్త, అడ్డూరి అభిషేక్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాకినాడ వన్‌టౌన్, టూటౌన్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా బలగం ప్రసన్నకుమార్, పాలేపు రవికుమార్, వినయ్, విష్ణు, అర్జున్ మాట్లాడుతూ.. కాకినాడలో మాదకద్రవ్యాల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల ప్రభావంతో యువత పెడదోవ పట్టకుండా తల్లిదండ్రులు, స్నేహితులు, సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒత్తిడిలో ఉన్న యువతను సకాలంలో గుర్తించి కౌన్సెలింగ్ అందించాల్సిన అవసరం ఉందన్నారు.
కోస్టల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రతి వార్డులో పర్యటించి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతకు విస్తృత అవగాహన కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. యువతను చైతన్యవంతం చేసి కాకినాడను మాదకద్రవ్యాల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు
