Kakinada : కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు...
* సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపణ...
*ప్రభుత్వ ఆస్తుల అమ్మకంపై తీవ్ర ఆగ్రహం..
కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా మారిందని, ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగులను అణచివేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆరోపించారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.
సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉందని కన్నబాబు విమర్శించారు. మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా రోడ్లపై ఈడ్చుకెళ్లి పోలీసు వాహనాల్లోకి ఎక్కించారని ఆరోపించారు. అర్హత పరీక్షలు రాసి, మెరిట్ ఆధారంగా ప్రజాసేవలోకి వచ్చిన ఉద్యోగులను కొన్ని అనుకూల మీడియా సంస్థలు కించపరిచేలా కథనాలు రాయడం సరికాదన్నారు.
గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ కనిపిస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తుకొస్తారనే అక్కసుతోనే కూటమి ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని కన్నబాబు ఆరోపించారు. జీవో నంబర్ 11 పేరుతో ఉద్యోగులపై అధిక పనిభారం మోపుతున్నారని, అర్ధరాత్రి సమయాల్లో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని అన్నారు. ఉద్యోగులపై ‘రెడ్‌బుక్’ విధానాన్ని ప్రయోగిస్తున్నారని ఆరోపిస్తూ, రాజకీయ విభేదాలను ఉద్యోగులపై చూపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో వాలంటీర్లకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇటీవల కోస్తా జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగినా బాధిత రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో నిర్మించిన పథకాలు, వ్యవస్థలకు పేర్లు మార్చినంత మాత్రాన పాలనలో మార్పు రాదని కన్నబాబు అన్నారు. గతంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా పెన్షన్లు అందేవని, ప్రస్తుతం పెన్షన్లలో కోతలు ఎందుకు విధిస్తున్నారని, కొత్త పెన్షన్లు ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగులు, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి బదులుగా కాలయాపన చేసేందుకే ప్రభుత్వం కమిటీలు వేస్తోందని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, ఆస్తులను ప్రభుత్వం అమ్మకానికి పెడుతోందని కన్నబాబు ఆరోపించారు. చోడవరం సహా పలు చక్కెర కర్మాగారాల భూములను కారుచౌకగా విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కార్పొరేట్లకు భూములు కట్టబెట్టడంపై చూపుతున్న శ్రద్ధ రైతులు కోరుతున్న భూములను ఇవ్వడంలో ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగులపై వేధింపులను నిలిపివేసి, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కన్నబాబు డిమాండ్ చేశారు.
