Kakinada : మృతిచెందిన హోంగార్డుల కుటుంబాలకు ‘చేయూత’
కాకినాడ జిల్లా : కాకినాడ : ఫాస్ట్ రన్నర్ :
ఒక రోజు డ్యూటీ అలవెన్సుతో ఆర్థిక సాయం అందించిన కాకినాడ జిల్లా హోంగార్డులు...
విధి నిర్వహణలో సుదీర్ఘకాలం సేవలందించి ఇటీవల మృతిచెందిన హోంగార్డుల కుటుంబాలకు కాకినాడ జిల్లా పోలీసుశాఖ అండగా నిలిచింది. హోంగార్డు సిబ్బంది స్వచ్ఛందంగా సమకూర్చిన ఒక రోజు డ్యూటీ అలవెన్సు, డిప్యూటేషన్ హోంగార్డుల ఒక రోజు కాంట్రిబ్యూషన్ మొత్తాలతో మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ మృతుల కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేశారు. హెచ్‌జీ-158 ఎన్. వెంకటరమణ కుటుంబానికి రూ.1,83,890/-, హెచ్‌జీ-257 సి.హెచ్. సుకుమార్ రాజు కుటుంబానికి రూ.1,83,180/-, హెచ్‌జీ-77 ఎస్. సోమేశ్వరరావు కుటుంబానికి రూ.1,83,180/- చొప్పున ఆర్థిక సహాయం అందించారు.
అదేవిధంగా మృతుల కుటుంబాలకు పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి రావాల్సిన రాయితీలు, ఇతర ప్రయోజనాలు అందేలా అవసరమైన చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ చేసిన లేదా ప్రమాదవశాత్తు, అనారోగ్య కారణాలతో మృతిచెందిన హోంగార్డుల కుటుంబాలను ఆదుకునేందుకు కాకినాడ పోలీసు యూనిట్‌లో పనిచేస్తున్న హోంగార్డులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఒక రోజు డ్యూటీ అలవెన్సును సమకూర్చి ‘చేయూత’గా అందించడం అభినందనీయమన్నారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలు పోలీసు సిబ్బందిలో ఐకమత్యాన్ని పెంపొందించడంతోపాటు, ఆపద సమయంలో తమ కుటుంబాలకు పోలీసుశాఖ అండగా ఉంటుందన్న భరోసాను కల్పిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో హోంగార్డుల ఆర్‌ఐ ఎం. నరసింహమూర్తి పాల్గొన్నారు.
