Kakinada : రాజధాని విద్యుత్ పంపిణీ ప్రైవేట్ పరం.. ఇదేనా బాబు గారి విజనరీ?
కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :
ప్రజలపై విద్యుత్ భారం మోపే ప్రణాళికలు మానుకోవాలి: జమ్మలమడక నాగమణి
రాజధాని ప్రాంతంలో విద్యుత్ పంపిణీ, రిటైల్ సరఫరాను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపే నిర్ణయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం పేరుతో ప్రజల నడ్డి విరిచే విధానాలను ప్రభుత్వం అవలంబిస్తోందని ఆరోపించారు.
బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో విద్యుత్ పంపిణీ, రిటైల్ సరఫరా వ్యవస్థను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. టెండర్లను ఆహ్వానించడం చూస్తుంటే ఇప్పటికే ఈ వ్యవస్థను ఎవరికో ధారాదత్తం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానం కలుగుతోందన్నారు.
విద్యుత్ వంటి మౌలిక అవసరాన్ని ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రభుత్వానికి అదనపు భారంతో పాటు ప్రజలపై మోయలేని ఆర్థిక భారం పడే అవకాశం ఉందని నాగమణి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాలుగు దఫాల పాలనలో కీలకమైన వ్యవస్థలను ప్రైవేట్ పరం చేయడం ఆనవాయితీగా మారిందని విమర్శించారు. తన అనుయాయులకు కాంట్రాక్టులు అప్పగించేందుకు ఇప్పటికే అన్ని దారులు తెరిచి ఉంటాయని ఆరోపించారు.
సామాన్యులపై భారం పడే అవకాశం
రాజధాని ప్రాంతంలో గృహ, వాణిజ్య, ప్రభుత్వ రంగాలకు విద్యుత్ పంపిణీ ప్రైవేట్ సంస్థల ఆధీనంలోకి వెళితే ఎదురయ్యే ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని నాగమణి అన్నారు. విద్యుత్ నెట్వర్క్ అభివృద్ధి, ఆపరేషన్స్, మెయింటెనెన్స్, గ్రిడ్ ఏర్పాట్లు, బిల్లింగ్, కలెక్షన్ వంటి సేవలను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే వాటి ఖర్చుల భారం సామాన్య ప్రజలు, రాజధాని ప్రాంతంలో వ్యాపారాలు నిర్వహించే వారిపై పడే అవకాశం ఉందన్నారు.
ఇప్పటికే అధిక విద్యుత్ బిల్లులతో ప్రజలు సతమతమవుతున్నారని, ఈ పరిస్థితుల్లో మరింత ఆర్థిక భారం మోపే నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోవడం సరికాదన్నారు. రాజధాని అభివృద్ధి పేరుతో ప్రజలపై అదనపు భారాన్ని మోపకుండా, విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా నిర్వహించాలని జమ్మలమడక నాగమణి డిమాండ్ చేశారు.
