Kakinada : అభివృద్ధి కావాలి.. విధ్వంసం కాదు : పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల అవగాహన
కాకినాడ జిల్లా : కాకినాడ : ఫాస్ట్ రన్నర్ :
పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాకినాడ అశోక్‌నగర్‌లోని ఆదిత్య పాఠశాలకు చెందిన 8, 9, 10 తరగతుల విద్యార్థులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. "అభివృద్ధి ధర.. ఆ మూల్యం చెల్లించేందుకు సిద్ధమేనా?” అనే సందేశంతో మానవహారం, ప్రార్థన, నాటికలు, ప్లకార్డుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
నేపాల్‌లో ఇటీవల సంభవించిన వరదలను ప్రస్తావిస్తూ ప్రకృతిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విద్యార్థులు వివరించారు. నదులు, పర్వతాలు, అడవులు, చెరువులు, ఇతర జల వనరులను పరిరక్షించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అనవసర నిర్మాణాలు, భారీ ఆనకట్టలు, జలవిద్యుత్ ప్రాజెక్టుల విషయంలో పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
"అభివృద్ధి అవసరం.. విధ్వంసం కాదు” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన విద్యార్థులు.. Reduce, Reuse, Recycle లో మొదటి దశైన Reduce ప్రాముఖ్యతను వివరించారు. అవసరం లేని వినియోగాన్ని, వ్యర్థాల ఉత్పత్తిని ముందుగానే తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రకృతికి అనుగుణంగా, భవిష్యత్ తరాల భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతమైన అభివృద్ధి జరగాలని విద్యార్థులు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విద్య మాట్లాడుతూ..
పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ఒక కార్యక్రమానికి పరిమితం కాకుండా ప్రతి విద్యార్థి, ప్రతి పౌరుడి బాధ్యతగా మారాలని అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రకృతి వనరులను దెబ్బతీయకుండా, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రకృతిని గౌరవించడం, వనరులను పొదుపుగా వినియోగించడం, వ్యర్థాలను తగ్గించడం వంటి విలువలను చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. భవిష్యత్తులో పర్యావరణంపై బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే చైతన్యవంతమైన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు పాఠశాల కృషి చేస్తుందని ఆమె అన్నారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌తో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సహకరించిన శాంతిభద్రతల శాఖ, ట్రాఫిక్ శాఖ, సబ్-డివిజనల్ అధికారి, మీడియా ప్రతినిధులకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.


