Kakinada : ఆంధ్రప్రదేశ్ గణేశ ఉత్సవ సమితి ఆవిర్భావం...
కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :
రాష్ట్రవ్యాప్తంగా గణేశ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సమితి కృషి...
ఆంధ్రప్రదేశ్‌లో గణేశ ఉత్సవాలను మరింత వైభవంగా, భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించడంతో పాటు హిందూ ధార్మిక, సాంస్కృతిక విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ గణేశ ఉత్సవ సమితి 2025 సంవత్సరంలో ఆవిర్భవించిందని సమితి ప్రతినిధులు తెలిపారు.
ప్రముఖులు, హిందూ ధార్మిక పెద్దలు, వివిధ సంస్థల ప్రతినిధులు, సాధుసంతులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తదితరుల సమన్వయంతో రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పడిందన్నారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
గణేశ ఉత్సవాలను కేవలం పండుగగా కాకుండా భక్తి, ధర్మం, సంప్రదాయం, సంస్కృతి, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిర్వహించడమే సమితి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నియమ నిబంధనలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా కులమత వర్గాలకు అతీతంగా గణేశ ఉత్సవాలు జరిగేలా ప్రజలను, ఉత్సవ కమిటీలను చైతన్యపరచనున్నట్లు వెల్లడించారు.
సనాతన సంప్రదాయాల పరిరక్షణ..
మన పూర్వీకుల నుంచి వస్తున్న సనాతన ధార్మిక సంప్రదాయాలు, పూజా విధానాలు, భారతీయ సంస్కృతిని రాబోయే తరాలకు పరిచయం చేసి, వాటి ప్రాముఖ్యతను తెలియజేయడం సమితి ముఖ్య ఉద్దేశ్యాలలో ఒకటని తెలిపారు. ప్రతి హిందూ కుటుంబం, ప్రతి గణేశ మండపంలో శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రోత్సహించడంతో పాటు సంప్రదాయ కళలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు చెప్పారు.
గణేశ ఉత్సవాలకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ గణేశ ఉత్సవ సమితి రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను కొనసాగిస్తోందన్నారు.
“భక్తితో గణేశ ఉత్సవం – సంప్రదాయంతో హిందూ సంస్కృతి – ఐక్యతతో హిందూ సమాజం” అనే స్ఫూర్తితో సమితి ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గణేశ ఉత్సవ సమితి కాకినాడ జిల్లా అధ్యక్షులు బి.ఎస్. శేతాపతిరావు, జిల్లా కార్యదర్శి తుమ్మలపల్లి నారాయణరావు (నాని), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఈసీ సభ్యులు కె. అప్పాజీ, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఏవీఎన్ఎస్ మూర్తి, జిల్లా జాయింట్ సెక్రటరీ జీవీఎస్ ప్రసాద్, జిల్లా ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న పుట్టా గాంధీ ప్రసాద్, పాల్వాడు సుబ్బారావు, శాలిగ్రామ విశ్వేశ్వర, అజయ్ వర్మ, పట్టాభిరామయ్య, కె. నాగేశ్వరరావు, శ్రీధర్, తడల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
