Kakinada : కూటమి పాలన.. మూడు మోసాలు, ఆరు అబద్ధాలు!...
*హౌసింగ్ స్కామ్‌పై విచారణకు వైఎస్సార్‌సీపీ సిద్ధం..
*తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కూటమి ప్రభుత్వ సమయం...
*కూటమి పాలన.. మూడు మోసాలు, ఆరు అబద్ధాలు!
*‘సీజ్ ద షిప్’ ఏమైందో మంత్రి నాదెండ్ల సమాధానం చెప్పాలి
కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :
రాష్ట్రంలో కూటమి పాలన ‘మూడు మోసాలు.. ఆరు అబద్ధాలు’ అన్న చందంగా సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలనపై దృష్టి సారించకుండా, లేనిపోని అపోహలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రానికి ఇటీవల వస్తున్న కేంద్ర మంత్రులకు అసత్యాలతో కూడిన స్క్రిప్టులు అందించి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేయించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని నాగమణి విమర్శించారు. తాము చేయలేని పనులను గత ప్రభుత్వం చేసి చూపించినప్పటికీ, వాటిని ప్రశంసించేందుకు కూడా ప్రస్తుత ప్రభుత్వానికి మనసు రావడం లేదని వ్యాఖ్యానించారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన శాఖ పరిధిలో జరుగుతున్న అక్రమ బియ్యం రవాణాపై సమాధానం చెప్పకుండా, గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెబుతున్న హౌసింగ్ అవినీతిపై విచారణ జరిపేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
కాకినాడ పోర్టు కేంద్రంగా జరిగిన బియ్యం రవాణాపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో మంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘సీజ్ ద షిప్’ అంటూ గతంలో చేసిన హడావుడి వెనుక ఉన్న కారణాలేమిటో వివరించాలని ప్రశ్నించారు. ప్రస్తుతం బియ్యం రవాణా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోందో ప్రజలకు పూర్తిగా తెలుసని ఆమె వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా 71 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించి, 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల కుటుంబాల్లో ఆనందం నింపేలా ఇళ్ల స్థలాలు కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిదేనని నాగమణి పేర్కొన్నారు. మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో ఇప్పటికే సుమారు 9 లక్షల మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌లో ప్రకటించిన విషయాన్ని మంత్రి నాదెండ్ల గుర్తించాలని సూచించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా తన వైఫల్యాలను గత ప్రభుత్వంపై నెడుతూ కాలం గడపడం సరికాదని విమర్శించారు. అసత్య ఆరోపణలు, మోసాలను పక్కనపెట్టి ఇప్పటికైనా ప్రజా సమస్యల పరిష్కారం, సమర్థవంతమైన పరిపాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. లేనిపక్షంలో ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని జమ్మలమడక నాగమణి హెచ్చరించారు.
