Kakinada : ప్రతి ఆదివారం స్థూలకాయ సమస్యల పరిష్కారానికి కృషి..
*అహోబిల ఆసుపత్రి వైద్యులు డా. ఆదిత్య...
కాకినాడ జిల్లా : కాకినాడ : ఫాస్ట్ రన్నర్ :
స్థూలకాయం సమస్యతో బాధపడుతున్న వారికి శాస్త్రీయ వైద్య విధానాల ద్వారా పరిష్కారం చూపేందుకు ప్రతి ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అహోబిల ఆసుపత్రి వైద్యులు డా. ఆదిత్య తెలిపారు. స్థానిక అహోబిల ఆసుపత్రిలో డా. ఆదిత్య ఆధ్వర్యంలో కాకినాడకు చెందిన ప్రముఖ వైద్యులతో కలిసి స్థూలకాయ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. ఆదిత్య మాట్లాడుతూ.. స్థూలకాయం తగ్గించుకోవడానికి శాస్త్రీయంగా ఆమోదించబడిన చికిత్సా విధానం నిర్దిష్ట వైద్య సూత్రాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. జీవనశైలి, ప్రవర్తనా మార్పులతో పాటు అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తూ సమగ్ర విధానంలో చికిత్స అందిస్తామని చెప్పారు. క్యాలరీల లోటు, సమతుల్య పోషకాహారం, ఆహారం తీసుకునే పరిమాణాన్ని నియంత్రించడం ముఖ్యమన్నారు. అతిగా తినడానికి దారితీసే మానసిక, ప్రవర్తనా కారణాలను గుర్తించి తగిన సూచనలు అందిస్తామని తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్థూలకాయ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా సేవలు అందిస్తామని వెల్లడించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోజుకు 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర పొందాలని సూచించారు. మానసిక ఒత్తిడి కారణంగా కార్టిసోల్ హార్మోన్ పెరిగి పొత్తికడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉందన్నారు. స్థూలకాయం అనేది కేవలం శరీర ఆకృతికి సంబంధించిన సమస్య కాదని, అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దారితీసే తీవ్రమైన ఆరోగ్య సమస్య అని తెలిపారు.
డా. అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ.. స్థూలకాయాన్ని నియంత్రించడంలో ఆహార నియమాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, మిల్లెట్స్, బ్రౌన్ రైస్ వంటి పీచు పదార్థాలు అధికంగా తీసుకోవాలని సూచించారు. పప్పుధాన్యాలు, గుడ్లు, పన్నీర్ వంటి ప్రొటీన్ ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. పంచదార, కూల్‌డ్రింక్స్, వేపుళ్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలను వీలైనంత వరకు తగ్గించాలని సూచించారు. ప్రతిరోజూ యోగా లేదా వ్యాయామం చేయడంతో పాటు తగినంత నీరు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డా. శ్రీమన్నారాయణ, డా. రాజ్‌కుమార్, డా. మూర్తి, డా. చలం, డా. రావు నారాయణరావు, డా. సుష్మ, కాకినాడ సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
