Kakinada : పోలవరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లోపాలు...
* మాజీ మంత్రి కురసాల కన్నబాబు...
కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :
ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను నాణ్యతకు పెద్దపీట వేయకుండా చేపడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆరోపించారు.
కాకినాడ రూరల్ వైద్యనగర్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలపై నిపుణుల కమిటీ ఇప్పటికే పలుమార్లు సూచనలు చేసినప్పటికీ, ఇప్పటికీ వాటిని సరిదిద్దే చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే సుమారు 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని, అలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే పనుల కంటే ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టులో కీలకమైన పనులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలోనే జరిగాయని కన్నబాబు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు కూడా తానే చేసినట్లుగా ప్రచారం చేసుకుంటూ క్రెడిట్ తీసుకుంటున్నారని ఆరోపించారు.
మరోవైపు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని అన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు ద్వారా వ్యక్తం చేస్తారని కన్నబాబు పేర్కొన్నారు.
