Kakinada : సన్‌రైజ్ ఆసుపత్రిలో ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం...
కాకినాడ జిల్లా : కాకినాడ : ఫాస్ట్ రన్నర్ :
ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సన్‌రైజ్ ఆసుపత్రిలో సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డా. అడ్డాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎముకల వైద్య నిపుణులు డా. బొండా సూర్యారావు ప్రజలకు ఎముకల సాంద్రత పరీక్షలు నిర్వహించి, ఆర్థరైటిస్ వ్యాధిపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డా. అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 12న ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి అండగా నిలవడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి, సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్య తీవ్రతను తగ్గించుకోవచ్చన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారం, క్రమబద్ధమైన వ్యాయామంతో మెరుగైన జీవితాన్ని గడపవచ్చని సూచించారు.
డా. బొండా సూర్యారావు మాట్లాడుతూ ఆర్థరైటిస్ అనేది కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చే వ్యాధి కాదని, పిల్లలు, యువకులు సహా ఏ వయస్సు వారినైనా ప్రభావితం చేయవచ్చని వివరించారు. కీళ్లలో నొప్పి, ముఖ్యంగా ఉదయం వేళల్లో బిగుసుకుపోవడం, కీళ్ల చుట్టూ వాపు, ఎరుపుదనం, కదలికల్లో ఇబ్బందులు ఈ వ్యాధికి ప్రధాన లక్షణాలని తెలిపారు.
కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నడక, ఈత, తేలికపాటి యోగాసనాలు వంటి వ్యాయామాలు చేయాలని సూచించారు. కాల్షియం, విటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు లభించే పాలు, ఆకుకూరలు, చేపలు, గింజలు వంటి పోషకాహారాన్ని తీసుకోవాలన్నారు. అధిక బరువు వల్ల ముఖ్యంగా మోకాళ్లపై అదనపు ఒత్తిడి పడుతుందని, బరువును నియంత్రణలో ఉంచుకోవడం అవసరమని పేర్కొన్నారు.
కీళ్ల నొప్పులు దీర్ఘకాలంగా వేధిస్తే స్వయంగా మందులు వాడకుండా, నిపుణులైన ఆర్థోపెడిక్ లేదా రుమటాలజీ వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజలు, సన్‌రైజ్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
